ఉమ్మడి విశాఖ జిల్లా
అసెంబ్లీ నియోజకవర్గాలు
ఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు
మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం
ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యం
ఆశావహుల్లో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాల సంఖ్య 21 నుంచి 22కు చేరుకోనుంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసిన నాయకులకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారగా, కొత్త తరం నేతలకు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ తమ గళాన్ని వినిపించాలన్న కలలు కనే వారికి ఈ పునర్విభజన ప్రక్రియ కొత్త ఆశలు, అవకాశాలు తెరచి పెడుతోంది.
ఓట్ల సంఖ్యను బట్టి విభజన
పునర్విభజన ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా సాగనున్నా.. ప్రధానంగా ఓటర్ల సంఖ్యే కీలక ప్రమాణంగా మారనుంది. ఒక నియోజకవర్గంలో సుమారు 1.6 లక్షల ఓటర్ల పరిమితి ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు కూడా ఇదే బాటలో నడవొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉంది. అలాగే నగరంలో కొత్తగా ‘విశాఖ సెంట్రల్’ నియోజకవర్గం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల నుంచి కొన్ని వార్డులు కలిపి దీనిని రూపొందించే అవకాశం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సమీకరణలు
పాయకరావుపేటలో అధిక ఓటర్ల సంఖ్య కారణంగా అది రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. యలమంచిలి, అనకాపల్లి పరిధిలో కొత్తగా ‘అనకాపల్లి రూరల్’ నియోజకవర్గం కూడా తెరపైకి రావొచ్చు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మార్పులు తప్పవు. నర్సీపట్నంలోని కొన్ని గ్రామాలు కలిపి... పాడేరు, అరకు నియోజకవర్గాలను పునర్విభజించి.. కొత్తగా ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఉన్న పరవాడ, చింతపల్లి నియోజకవర్గాలు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.
పార్లమెంట్ మ్యాప్ కూడా మారే చాన్స్
అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిమితి మారి.. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ సీట్లతో రీడిజైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం ప్రాంతంలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గం కూడా రావచ్చనే చర్చ నడుస్తోంది.
ద్వితీయ శ్రేణి
నేతల జోరు
సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధ్యక్షా.. అని పిలిపించుకోవాలని తపించే రాజకీయ నేతలకు కేంద్రం నిర్ణయం ఒక వరంగా మారింది. నియోజకవర్గాల హద్దులు మారనుండటంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
పునర్విభజనతో మారనున్నఉమ్మడి విశాఖ జిల్లా ముఖచిత్రం
పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం
ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సీట్లు
2029 సమరానికి
ఇప్పుడే మొదలైన లెక్కలు
జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఒక ఎస్సీ (పాయకరావుపేట), రెండు ఎస్టీ (అరకు, పాడేరు) స్థానాలకు అదనంగా.. మరో ఎస్సీ, మరో ఎస్టీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది.


