పాడేరు: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కొనుగోలు కమిటీ ఆదేశాల మేరకు, రూ.1.50 కోట్ల నీతి ఆయోగ్ నిధులతో 13 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్నట్లు ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ–టెండర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.అర్హత కలిగిన ఏజెన్సీలు, సరఫరాదారులు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల సంస్థలు టెండర్ నిబంధనలు, పూర్తి వివరాల కోసం అల్లూరిసీతారామరాజు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ


