సీలేరు: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. స్థానిక పీహెచ్‌సీకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వంజరి శివ, ఫార్మసిస్టు అరుణ, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్‌ఎం దుచ్చరి దేవి, ఆశా కార్యకర్త జ్యోతి విశిష్ట సేవలకు గానూ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు.


