ఆశా కార్యకర్త చొరవతో ఆస్పత్రికి రోగి తరలింపు
సీలేరు: దుప్పులవాడ పంచాయతీ వలసపల్లికి చెందిన కిముడు సోమర అనే వృద్ధుడు వారం రోజులుగా తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆశా కార్యకర్త ఇచ్చిన మాత్రలు వాడినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో శనివారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆశా కార్యకర్త అంబులెన్స్‌కు సమాచారం అందించింది. గ్రామానికి వెళ్లే మార్గం సరిగ్గా లేకపోవడంతో అతనిని గ్రామస్తులు, బంధువులు మోసుకుంటూ గెడ్డను దాటించి అంబులెన్సులో ఎక్కించారు. అక్కడి నుంచి సీలేరు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. సోమరకు వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రక్తహీనత ఎక్కువగా ఉండటం, దానికి తోడు దగ్గు, ఆయాసం తీవ్రంగా ఉండటంతో ఆయనకు టీబీ ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఆస్పత్రికి తరలించామని వైద్యాధికారి నారాయణరావు తెలిపారు.


