పర్యాటక సౌరభం
మన్యం ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో పర్యాటకుల రాక గణనీయంగా పెరగడంతో పర్యాటక శాఖ, పాడేరు ఐటీడీఏకు భారీ ఆదాయం సమకూరింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తడంతో స్థానిక పర్యాటక కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ రికార్డు స్థాయి రాకతో అటు ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, ఇటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి మన్యం ఆర్థికంగా పుంజుకుంటోంది.
బొర్రా గుహలకు భారీగా తరలివస్తున్న సందర్శకులు
కలిసొచ్చిన 2025
పర్యాటకుల రద్దీ బాగున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. 2024 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య రూ. 4,86,66,977 ఆదాయం వచ్చింది. 2025లో అదే సమయానికి రూ. 4,50,15,050 వచ్చింది. అయితే గతేడాది కంటే ఈ ఏడాది రూ.36,51,920 ఆదాయం తగ్గింది. తుపాను ప్రభావం వల్ల సుమారు 52,170 మంది వరకు సందర్శకుల సంఖ్య తగ్గింది.
– గౌరీశంకర్, మేనేజర్, బొర్రా గుహలు
రోజుకు రూ.వెయ్యి ఆదాయం
మాడగడ నుంచి సన్‌రైజ్ వ్యూపాయింట్ వరకు ప్రతీ రోజు ఆటోలో పర్యాటకులకు తీసుకువెళ్లి తీసుకువస్తుంటా. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పర్యాటకులను తీసుకువెళ్తుంటా. ఆయిల్ ఖర్చులు పోగా రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వస్తుంది.
– మాదల బారికి గెన్ను,
ఆటో డ్రైవర్, మాడగడ, అరకులోయ
అరకులోయ టౌన్: మంచు దుప్పటి కప్పుకున్న అరకు ప్రాంత అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 2025 ముగింపు వేళ అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని పర్యాటక కేంద్రాలు జనసందోహంతో కిటకిటలాడాయి. అక్టోబర్‌లో తుపా ను ప్రభావంతో కాస్త వెనుకబడిన పర్యాటకం, నవంబర్, డిసెంబర్ నెలల్లో పుంజుకుని పర్యాటక శాఖకు, పాడేరు ఐటీడీఏకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
ఒక్క నెలలోనే రూ. 2.35 కోట్లు..
గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి 31 వరకు సుమారు 3,76,296 మంది పర్యాటకులు మన్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. వీరి ద్వారా ప్రవేశ రుసుం రూపంలో రూ. 2,35,91,610 ఆదాయం సమకూరింది. ఇందులో సింహభాగం బొర్రా గుహల నుంచి రావడం విశేషం.
ఆదాయ వివరాలు:
బొర్రా గుహలను 1,78,571 మంది సందర్శించగా రూ. 1.25 కోట్లు సమకూరింది.
గిరిజన మ్యూజియాన్ని 1,08,044 మంది సందర్శించగా రూ. 64.75 లక్షల ఆదాయం వచ్చింది.
చాపరాయి జలవిహారిని 54,561 మంది సందర్శించగా రూ. 20.29 లక్షలు సమకూరింది.
పద్మాపురం గార్డెన్‌ను 35,120 మంది సందర్శించారు. రూ. 30.86 లక్షల ఆదాయం వచ్చింది.
ఉపాధికి కేరాఫ్ అడ్రస్ ‘మాడగడ’
ఈ ఏడాది అరకులోయ మండలంలోని మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ పర్యాటకుల హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ సుమారు 300 గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయి. పర్యాటకులకు గిరిజన సంప్రదాయ దుస్తులు అలంకరించడం, థింసా నృత్యాలు, స్థానిక తినుబండారాల విక్రయాల ద్వారా మహిళలు, యువత మంచి ఆదాయం గడిస్తున్నారు.
అరకు పర్యాటకానికి కాసుల పంట
పెరుగుతున్న తాకిడి
ఒక్క డిసెంబర్ నెలలోనే
3,76,296 మంది సందర్శన
రూ.2,35,91,610 ఆదాయం
పర్యాటక సౌరభం
పర్యాటక సౌరభం
పర్యాటక సౌరభం
పర్యాటక సౌరభం


