హైవే పనులకుఆటంకం కలిగించొద్దు
● పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు
జి.మాడుగుల: జాతీయ రహదారి 516ఈ నిర్మాణ పనులకు సంబంధించి నష్టపరిహారం అందని వారు అటంకం కలిగించవద్దని పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. మండలంలోని బలమానుశంక, వరిగెలపాలెం, కులుపాడు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణంలో ఇల్లు, భూములు నష్టపోయిన బాధితులు అందరికీ తగిన నష్టపరిహారం కచ్చితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అందరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎస్‌ఐ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.


