ప్రతి గిరిజన రైతు సమస్యలను ఇంటింటికి వెళ్లి తెలుసుకోవడం
సాక్షి,పాడేరు: రైతులకు రబీలో వ్యవసాయ రుణాలు, వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని, ఉచిత విత్తనాలు, ఇతర సౌకర్యాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసింది. దీంతో రైతన్న మీకోసం కార్యక్రమాలకు కొద్దోగొప్పో గిరిజన రైతులు హాజరయ్యారు. గత నెల 24నుంచి 29 వరకు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 3,050 గ్రామాల్లో రైతన్న మీకోసం సభలు నిర్వహించారు. ఇవన్నీ మొక్కుబడిగా జరిగాయని, వీటి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని పలువురు గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వతేదీన జిల్లాలోని 304 రైతు సేవా కేంద్రాల పరిధిలో గ్రామ సచివాలయాల స్థాయిలో నిర్వహించిన సమావేశాలది ఇదే పరిస్థితి అని వారు ఉదహరిస్తున్నారు.
సాగుపై కానరాని భరోసా
గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటా తిరిగి వ్యవసాయంపై భరోసా కల్పిస్తారని గిరిజన రైతులు ఆశించినా ఫలితం లేకపోయింది. గ్రామాలు, సచివాలయాల పరిధిలో రాజకీయ సభలుగా ఈ కార్యక్రమం మారిందని పలువురు విమర్శిస్తున్నారు. కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ అన్నింటా టీడీపీ నేతలు, కార్యకర్తలదే హవాగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంగా సభలు మార్చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
గిడ్డికి అధికారుల వత్తాసు
పాడేరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం పాడేరు మండలం డోకులూరు సచివాలయంలో రైతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల సాక్షిగా అధికారికంగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచారం చేశారు. అమెకు అధికారికంగా ఏహోదా లేకపోయినా కీలకంగా వ్యవహరించడం, అందుకు అధికారులు వత్తాసుపలకడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
పట్టని రైతు సమస్యలు
జిల్లా వ్యాప్తంగా 3035 గిరిజన గ్రామాలు, 305 గ్రామ సచివాలయాల పరిధిలో నిర్వహించిన రైతన్న నేస్తం కార్యక్రమంలో గిరిజన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 18 నెలల కాలంలో గిరిజన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పండించిన వ్యవసాయ, వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోగా, అన్నదాత సుఖీభవ ప్రభుత్వ సాయం చాలామంది అర్హులైన గిరిజన రైతులు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అమలుజేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం రూ.2 వేల సాయం పొందుతున్న గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ సాయం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య కోసం మాట్లాడే తీరిక ఈ సభల్లో అధికారులకు లేకపోయిందని వారు వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన రైతులు విలువైన పశుసంపదను అమ్ముకుంటున్న దుస్థితి జిల్లాలోని గ్రామాల్లో నెలకొంది.
రైతన్నా మీకోసం..
అంతా మోసం!
తూతూమంత్రంగా ఇంటింటి సర్వే
రైతు సమస్యలపై కానరాని చర్చ
రాజకీయ సభల్లా కార్యక్రమం
అధికారికంగా ఏ హోదా లేకున్నా
గిడ్డి ఈశ్వరి పెత్తనం
పార్టీ ప్రచారంగా మారిందని
గిరి రైతుల విమర్శ
మమ అనిపించిన చంద్రబాబు సర్కారు
ప్రతి గిరిజన రైతు సమస్యలను ఇంటింటికి వెళ్లి తెలుసుకోవడం


