టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ
చింతపల్లి: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇవ్వాలని పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ అన్నారు. సూపర్ 50 లో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న చింతపల్లిలో బాలుర,బాలికల ఆశ్రమ పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడేరు డివిజన్ పరిధిలో ప్రతిభ కనబరిచిన 100 మంది టెన్త్ విద్యార్థులను గుర్తించి, వారికి మోదాపుట్టు, గుత్తులపుట్టు, చింతపల్లి బాలికల, బాలుర ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ తరగతులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పదవ తరగతితో పాటు భవిష్యత్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన నైపుణ్యతను అందించే విధంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం జూనియర్ కళాశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం హెచ్‌డబ్యువోలు ఆమెను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్,బి.వి.జి.ఎన్. రాజు,వార్డెన్‌లు రత్నం, తిరుపతిరావు, గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


