
ఇంటి పన్నుల వసూళ్లలో జాప్యం చేస్తే చర్యలు
డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించి ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పంచాయతీ అధికారులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇంటిపన్ను వసూళ్లలో జాప్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మతో కలిసి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.