
యారాడ బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
పెదగంట్యాడ: యారాడ తీరంలో సరదాగా గడుపుతున్న ఇద్దరు యువకులు సముద్రపు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది స్నేహితులు మూడు ద్విచక్ర వాహనాలపై ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో యారాడ తీరానికి చేరుకున్నారు. వీరంతా సముద్రం వద్ద ఇసుకలో ఆటలాడుతుండగా, వారిలో ఇద్దరు.. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న జీవీఎంసీ 76వ వార్డుకు చెందిన బొత్స పవన్‌కుమార్ (26), డిగ్రీ చదువుతున్న గాజువాక కై లాస్‌నగర్‌కు చెందిన పగడాల గణేష్ (17) సముద్ర స్నానానికి దిగారు. ఈ సమయంలో సముద్రపు కెరటాల ఉధృతి పెరగడంతో వారు లోపలికి కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి గాలించినప్పటికీ యువకుల ఆచూకీ లభించలేదు. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యారాడ బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు