
గుర్రాయి జలపాతం అభివృద్ధికి కృషి
జి.మాడుగుల: మండలంలో కుంబిడిసింగి–పెదలోచలి పంచాయతీల మధ్యలో ప్రకృతి అందాలతో కొండల నడుమ ప్రవహిస్తున్న గుర్రాయి జలపాతాన్ని ఆదివారం ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు సందర్శించారు. జలపాత ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జలపాతం పరిసరాలు చాపరాయి కంటే అందంగా ఉన్నాయని, పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందన్నారు. జి.మాడుగుల మండల కేంద్రానికి 3 కిలోమీటర్లు దూరంలో గల ఈ జలపాత ప్రాంతాన్ని అబివృద్ధి దిశగా ముందుకు తీసుకుకెళ్తామని ఆయన తెలిపారు. జలపాతాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. గుర్రాయి జలపాతం అభివృద్ధి అంశాన్ని కలెక్టర్, ఐటిడిఏ పీవో దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.