
సమస్యలతో సతమతం
కొయ్యూరు: మండల కేంద్రం రాజేంద్రపాలెం ప్రధాన రహదారికి డ్రైనేజీ లేకపోవడంతో వర్షం కురిస్తే నీరు రోజుల తరబడి నిల్వ ఉండిపోతుంది. గోతుల్లో చేరడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం కురిస్తే రాజేంద్రపాలెం ఆస్పత్రికి వెళ్లే దారి, వినాయకుని ఆలయం సమీపంలో నీరు రోజుల తరబడి నిల్వ ఉంటుంది. మురుగునీరు రోడ్లపై పారుతోంది. తీవ్ర దుర్గంధంతో సతమతమవుతున్నాని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు విస్తరణ కాగితాలకే పరిమితం కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు నాలుగు కిలోమీటర్ల మేరకు రహదారిని మూడున్నర మీటర్ల నుంచి ఏడు మీటర్లకు విస్తరించే అవకాశం ఉంది. రోడ్డు విస్తరణ జరిగిన తర్వాతనే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం మంచిదని భావిస్తున్నారు. కాని రహదారి విస్తరణ విషయం ఏళ్లతరబడి కాగితాలకు పరిమితమైందని పలువురు చెబుతున్నారు. ప్రతీ మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేయాలనే నిబంధన ఉన్నా ఇక్కడ అమలు కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణ చేయకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేస్తే రోడ్డు విస్తరణ పనుల తర్వాత వాటిని తొలగించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. చీడిపాలెం పంచాయతీ సింగవరం నుంచి రాజేంద్రపాలెం శివారు సూరేంద్రపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేరకు డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల ఒక వైపు కొంత దూరం వరకు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించాలని వారు కోరుతున్నారు.
పాడేరు రూరల్: మండలంలో కుజ్జేలి పంచాయతీ ది.గుమోదపుట్టు నుంచి వై.మోదపుట్టు మీదుగా హుకుంపేట మండలం అండిబ, భీమవరం, బాకురు, పాడేరు మండలం డల్లాపల్లి, సలుగు పంచాయతీ కేంద్రం వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. గతేడాది ప్రారంభమైన వంతెన పనులు అర్ధంతరంగా నిలిచాయి. ఈ రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఈ మార్గమే ప్రధానం. గోతులు, కోతకు గురైన రహదారితో ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అత్యవసర సేవలు సకాలంలో అందక పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై పాడేరు ఎంపీడీవో తేజరతన్ మాట్లాడుతూ రహదారి మరమ్మతుకు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
అధికారులు స్పందించాలి
వర్షం కురిస్తే అనేకచోట్ల నీరు నిల్వ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. డ్రైనేజీలు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణంపై దృష్టి సారించాలి.
– రాజుబాబు, రాజేంద్రపాలెం
అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
అధ్వాన దారులతో ఇక్కట్లు
వర్షం కురిస్తే నిలిచిపోతున్న నీరు
రహదారి విస్తరణ జరగక ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు

సమస్యలతో సతమతం