సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్
రంపచోడవరం/చింతూరు: రాబోయే దీపావళి పండగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించే బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని రంపచోడవరం సబ్ కలెక్టర్, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌ఐలు, ఫైర్ ఆఫీసర్లతో శుక్రవారం చింతూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రశాంతంగా బాణసంచా విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విక్రయాలు జరిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని, వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. దుకాణాలను పాఠశాలలు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులకు దూరంగా అధికారులు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దుకాణాల వద్ద ఇసుక బకెట్లు, నీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, పండగ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం దుకాణాలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.