
గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరం
గంగవరం: ప్రజలు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ చెప్పారు. జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశాల మేరకు మండలంలోని జగ్గంపాలెం గ్రామంలో శుక్రవారం జనమైత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, నకిలీ లోన్ యాప్స్, ఓటీపీ వల, మోసపూరిత లింకులు, ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణాపై సమాచారం తెలిస్తే 1972 టోలిఫ్రీ నంబర్ సమాచారం ఇవ్వాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అపరిచితులతో ఆన్‌న్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు వచ్చినప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో త్వరలో భర్తీ చేయనున్న పలు పోస్టులకు సంబంధించి గిరిజన యువతకు శారీరక ,ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఎస్పీ వివరించారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, గంగవరం ఎస్‌ఐ బి.వెంకటేష్ , జగ్గంపాలెం సర్పంచ్ లీలావతి, , పద్మావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధార్ధదొర, శ్రీనివాసు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.