
ఆపదలో పల్లె వైద్యం
సాక్షి,పాడేరు: జిల్లాలో పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ప్రభావం రోగుల ఆరోగ్య సేవలపై చూపుతోంది. సమస్యలు పరిష్కారం కోరుతూ గత నెల 29 నుంచి విధులకు దూరమయ్యారు. వీరంతా విజయవాడలో ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ వీరి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా సమ్మెలో ఉండగా 14 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వీసు పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతుల కల్పన, గిరిజన ప్రాంతాల్లో విధులు, 104 సంచార చికిత్స అలవెన్స్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీంతో గ్రామీణ వైద్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉన్నందున చాలాచోట్ల రౌండ్ క్లాక్ సేవలు అందుబాటులో ఉండేవి. పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ప్రభావం గ్రామీణ వైద్యసేవలపై లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
● వైద్యసిబ్బంది అందించే సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని రోగులు ముంచంగిపుట్టు, చింతూరు, చింతపల్లి, కూనవరం, అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అరకులోయ, రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రులు, పాడేరు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓపీ, రక్తపరీక్షల విభాగాల వద్ద బారులు తీరుతున్నారు.
● జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ ఆస్పత్రులు, ఆయుష్ విభాగం నుంచి 30 మంది వైద్యులను కొన్ని ఆస్పత్రులకు తాత్కాలికంగా కేటాయించామని అధికారవర్గాలు చెబుతున్నా అందుకుతగ్గట్టుగా సేవలు అందించలేకపోతున్నారని రోగులు వాపోతున్నారు.
● పీహెచ్‌సీ వైద్యులు లేకపోవడంతో ఆ భారమంతా వైద్యసిబ్బందిపై పడుతోంది. పీహెచ్‌సీలకు వస్తున్న నెలలు నిండిన గర్భిణులకు నర్సింగ్ సిబ్బంది ప్రసవం చేస్తున్నారు. కాన్పు కష్టం అనుకుంటే వారిని రిఫరల్ ఆస్పత్రుతలకు తరలిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో గర్భిణులకు నరకంగా మారింది. తల్లీబిడ్డలకు ఆరోగ్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో
18 రోజులుగా రోగుల ఇక్కట్లు
వారి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం
వైద్యసేవలు పొందేందుకు నానా
అవస్థలు పడుతున్న ప్రజలు

ఆపదలో పల్లె వైద్యం