
ఆదివాసీల భూములను ప్రాజెక్ట్‌లకు ఎలా కేటాయిస్తారు?
● గిరిజన ఆదివాసీ సంఘ జిల్లా
గౌరవ అధ్యక్షుడు
బోనంగి చిన్నయ్యపడాల్ ధ్వజం
● ఎర్రవరంలో ఆందోళన
చింతపల్లి: గిరిజన ప్రాంతంలోని 5వ షెడ్యూల్‌లో ఆదివాసీల భూములను హైడ్రోపవర్, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల పేరిట జీవోల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఎవరిచ్చారని గిరిజన ఆదివాసీ సంఘ గౌరవ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ధ్వజమెత్తారు. గురువారం మండలంలోని ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులు ప్లకార్డులు చేతపట్టి, కళ్లకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జీవోలను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు భూములు, చట్టాలపై పెత్తనం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినిప్పటికీ రాష్ర ప్రభుత్వం ఆ తీర్పులను అమలు చేయడం లేదన్నారు ఏజెన్సీలో ఆదీవాసీ భూములను దోచుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆరోపించారు. ఈ జీవోల వల్ల మన్యం ప్రాంతంలో 250 గ్రామాలు నిర్వాసితులు కావడంతో పాటు 50 వేలమంది గిరిజనులు ఆదివాసీ ప్రాంతానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల జీవోలు రద్దుకు అన్ని ప్రాంతాలు గిరిజనులతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్లు గూడెపు రాజు,వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.