
గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయం
జి.మాడుగుల: అల్లూరి జిల్లా వ్యాప్తంగా పోలీస్‌శాఖ నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాడేరు డీఎస్పీ ఎస్.షహబాజ్ అహ్మద్ తెలిపారు. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగరువు గ్రామంలో గురువారం జరిగిన వారపు సంతలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ కేర్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశాలమేరకు గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు దృష్ట్యా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు వైద్య సదుపాయాలు కల్పించినట్టు ఆయన చెప్పారు. వైద్య శిబిరంలో 700 మందికి డాక్టర్ మురళీధర్, డాక్టర్ సతీష్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ సౌజన్య, ఎంజీసీహెచ్ డాక్టర్ హారిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ లంబోరి అప్పలరాజు, ఎస్‌ఐ షణ్ముఖరావు, పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ షహబాజ్ అహ్మద్

గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయం