
హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దు
అరకులోయటౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దని పాడేరు డీఎస్పీ షెహబాజ్ ఆహ్మద్ అన్నారు. మండలంలోని బస్కీ పంచాయతీ కేంద్రంలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో కలిసి పంచాయతీ ప్రజలతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆయా గ్రామ గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారన్నారు.
తప్పిపోయిన విద్యార్థుల అప్పగింత
పెదబయలు, పాడేరు, హుకుంపేట మండల్లాలోని ఏకలవ్య పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పి.అరవిందు, బి.సాయితేజ, ఎం.అశోక్‌లు మంగళవారం పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులను డీఎస్పీ షెహబాజ్ ఆహ్మద్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన విద్యార్ధుల కోసం పాఠశాల ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు వాకాబు చేశారని, వారి ఆచూకీ లభించకపోవడంతో 15వ తేది పెదబయలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పాడేరు ఎస్పీ అమిత్‌బర్దర్‌కు వచ్చిన సమాచారం మేరకు పాడేరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో విషయం పొందుపరిచామన్నారు. దీంతో అరకు సంత బయలుకు చెందిన కె.సుబ్రహ్మాణ్యం అనే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలను చేసి వారిని గుర్తించి అరకులోయ సీఐ హిమగిరికి సమాచారం ఇచ్చారన్నారు. దీంతో సీఐ హుటాహటిన అక్కడకు చేరుకొని విద్యార్థులను అదుపులోకి తీసుకొని వారు పాఠశాల నుంచి పరారీ కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా చదువుకోలేక ఒత్తిడికి గురవుతున్నామని, అందుకు పాఠశాల నుంచి బయటకు వచ్చినట్లు వారు వివరించినట్టు తెలిపారు. అనంతరం ఆయా విద్యార్థులను పాఠశాల యాజమన్యం, వారి తల్లిదండ్రులకు అప్పగించిచామన్నారు. సమాచారం ఇచ్చిన సుబ్రహ్మాణ్యంకు నగదు రివార్డు అందించామన్నారు. సీఐ ఎల్.హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దు