
పథకాలు నూరుశాతం అమలుకు గ్రామాల్లో పర్యవేక్షణ
● కలెక్టర్ దినేష్‌కుమార్
● చాకిరేవులలో పల్లె నిద్ర
అడ్డతీగల: ప్రభుత్వ పథకాలు నూరుశాతం అమలుకు గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన చాకిరేవులలో మంగళవారం రాత్రి కలెక్టర్ , రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ తదితర అధికారులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి తాము కనీస వసతులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు పూర్తిస్థాయిలో అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం నుంచి వీరవరం మీదుగా వెదురునగరం వరకూ రహదారి నిర్మించాలని కోరారు. గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వీరవరం నుంచి కొయ్యూరు మధ్యలో కాలువపై వంతెన నిర్మించాలన్నారు. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోనికి తీసుకురావాలని విన్నవించారు. కన్నేరు,ఏలేరు వాగులపై జలాశయం నిర్మిస్తే వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సంబందిత అధికారులతో చర్చించి గ్రామ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దొరకయ్య, ఎంపీడీవో ఏవీవీ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఐ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.