
కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్
చింతూరు ఐటీడీఏ ముట్టడి
లోపలకు దూసుకెళ్లిన
పది గ్రామాల నిర్వాసితులు
పరిహారం, పునరావాసం
కల్పించాలని డిమాండ్
కలెక్టర్ ఎదుట సమస్యల ఏకరువు
చింతూరు: పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ పది గ్రామాలకు చెందిన పోలవరం నిర్వాసితులు బుధవారం చింతూరు ఐటీడీఏను ముట్టడించారు. మండుటెండలో ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన వారు ప్రధానగేటుతో పాటు పోలీసులను తోసుకుని ఐటీడీఏలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
గంటన్నరసేపు మండుటెండలో..
స్థానిక ఐటీడీఏలో కలెక్టర్ దినేష్‌కుమార్ బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ క్రమంలో వీఆర్‌పురం మండలం రామవరం, చొప్పల్లి, రామవరంపాడు, సోములగూడెం, శబరిరాయిగూడెం, కొప్పల్లి, అడవివెంకన్నగూడెం, నూతిగూడెం, గుర్రంపేట, చింతూరు మండలం మల్లెతోటకు చెందిన పోలవరం నిర్వాసితులు భారీసంఖ్యలో ఐటీడీఏ వద్దకు వచ్చారు. ప్రధానగేటు ఎదుట బైఠాయించారు. వరుస వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తమకు పరిహారం అందించడంతో పాటు పునరావాసం కల్పించాలంటూ వారు నినాదాలు చేశారు. వారు సుమారు గంటన్నర పాటు మండుటెండలో ఆందోళన చేశారు,
మిన్నంటిన నినాదాలు
అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన నిర్వాసితులు ప్రధాన గేటుతో పాటు అక్కడ కాపలాగా వున్న పోలీసులను తోసుకుంటూ ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కార్యాలయంలోకి వెళ్లే గేటును మూసేశారు. నిర్వాసితులు అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ రావాలని, తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ వారు నినాదాలు చేశారు. దీంతో కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అక్కడికి చేరుకుని నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యం కోసం అవస్థలు
వరదల సమయంలో నెలల తరబడి రహదారులు ముంపులో ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి.
– మాడి ముత్యాలరావు, రామవరం,
వీఆర్‌పురం మండలం
నిత్యావసరాలకు కష్టాలు
వరదల సమయంలో నీరు గ్రామాలచుట్టూ చేరడంతో మేము బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఇళ్లలో నిత్యావసరాలు నిండుకుంటున్నాయి. వరద తగ్గిన తరువాత అధికారులు ఇస్తున్నారు. – ఆసు లక్ష్మణరావు,
సోములగూడెం, వీఆర్‌పురం మండలం
రూ.పది లక్షలివ్వాలి
2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పోలవరం పరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలి. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలి.
– పూసం సత్తిబాబు,
చొప్పల్లి, వీఆర్‌పురం మండలం
పథకాలివ్వడం లేదు
పోలవరం ముంపు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదు. ఎరువులు ఇవ్వకపోవడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింప చేయలేదు.
– కారం సుందరయ్య,
అడవి వెంకన్నగూడెం, వీఆర్‌పురం మండలం

కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్

కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్

కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్

కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్

కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్