
గిరిజనుడి మృతదేహంతో బంధువుల ఆందోళన
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీలో గిరిజనుడు మృతి చెందడంతో వైద్యాధికారి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలో ఇందిరా కాలనీకి చెందిన టొంగి ఆదినారాయణ (52) అనే గిరిజనుడికి రెండు కాళ్లు పని చేయకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం స్థానిక సీహెచ్‌సీకి ప్రైవేట్ వాహనంలో తీసుకువచ్చారు.స్థానిక వైద్యాధికారి గీతా గాయత్రి వైద్య సేవలు అందించారు. ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆస్పత్రి అంబులెన్సు మరమ్మతులకు గురైన కారణంగా అందుబాటులో లేదు. దీంతో 108కు ఫోన్ చేశారు. గంటల కొద్దీ సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వారు అంబులెన్సుకోసం వేచి చూశారు. అదేరోజు రాత్రి 12 గంటల తరువాత ఆదినారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆ సమయంలో వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో లేరు. ఆదినారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో తెల్లవారుజాము 4 గంటలకు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి వైద్యాధికారి గీతాంజలికి ఫోన్ చేస్తే వస్తానని చెప్పినప్పటికీ రాలేదని, బుధవారం ఉదయం ఐదు గంటలకు వచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వైద్యాధికారి తీరుపై ఆగ్రహం
పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా వైద్యాధికారి తీరికగా వచ్చారంటూ ఆమైపె మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యసేవలు అందించడంలో ఆమె నిర్లక్ష్యం వల్లే ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. పాడైన అంబులెన్సుకు మరమ్మతులు చేపట్టకపోవడం, 108 సకాలంలో రాకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.
వైద్యులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అత్యవసర పరిస్థితుల్లో ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. మృతదేహంతో సీహెచ్‌సీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అర్ధరాత్రి విషమించిన ఆరోగ్యం
పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు అందుబాటులో లేక అవస్థలు
సకాలంలో రాని 108 వాహనం
ఫోన్ చేసినా వైద్యాధికారి స్పందించ లేదంటూ కుటుంబ సభ్యులు ధ్వజం
ఆమె నిర్లక్ష్యమే మృతికి
కారణమంటూ ఆవేదన
ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ఎదుట నిరసన

గిరిజనుడి మృతదేహంతో బంధువుల ఆందోళన