
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక వ్యూహం
ఎస్పీ అమిత్ బర్దర్
పాడేరు : జిల్లాలో గంజాయి సాగు, రవాణా, సరఫరాను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తామని ఎస్పీ అమిత్‌బర్దర్ అన్నారు.బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నిర్వహించిన నెలవారీ సమీక్షలో పోలీసు అధికారులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. గంజాయితో సంబంధం ఉన్నా, అక్రమ కార్యకలాపాలపైన జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వ్యక్తులను నిశితంగా పరిశీలిస్తామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు వారియొక్క పూర్వ చరిత్ర పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలన్నారు. ఎవరైనా వ్యక్తులు ఎక్కడైనా ఆశ్రయం పొంది గంజాయి కేసుల్లో పట్టుబడితే ఆశ్రయం ఇచ్చిన వారిపైనా కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా అనుమానస్పదంగా సంచరించినా, అనుమానస్పద కార్యకలపాలకు పాల్పడినా వెంటనే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గంజాయి సాగు, రవాణ, సరఫరాను అడ్డుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాను మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేయడం తమ ఏకై క లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.