
వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించాలి
● లేకుంటే పిల్లలను ఇంటికి తీసుకుపోతాం
● లబ్బూరు ఏకలవ్య పాఠశాల విద్యార్థుల
తల్లిదండ్రుల హెచ్చరిక
ముంచంగిపుట్టు: వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించాలని లేకుంటే తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లిపోతామని లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. బుధవారం వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్‌తో సమావేశం అయ్యారు. పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి స్నానం చేసేందుకు సైతం నీళ్లులేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పడుతున్న బాధలు చెప్పు కుంటే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హెచ్చరించడం సరైన పద్ధతి కాదన్నారు. సమస్యల మధ్య తమ పిల్లల చదవులు ఎలా సాగుతాయని ప్రిన్సిపాల్‌ను వారు ప్రశ్నించారు. వారం రోజుల వరకు అవకాశం ఇస్తామన్నారు. అప్పటికీ పరిష్కరించకుంటే నీటి సమస్య తీరిన రోజే పాఠశాలకు పంపిస్తామని వారు స్పష్టం చేశారు.దీనిపై కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించాలని వారు కోరారు.