
నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యం
● ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశం
సాక్షి,పాడేరు: జిల్లాలో నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారిపై నిఘాతో పాటు, వలసదారుల పూర్వ చరిత్రపై కఠినంగా దృష్టి పెట్టాలన్నారు. గంజాయి కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన, తాత్కాలిక సహాయం అందించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామసందర్శనను విజయవంతంగా నిర్వహించాలని, పలు కేసుల్లో సమగ్ర విచారణ, చార్జిషీట్లు పూర్తి చేయాలని, కోర్టుల్లో నేరస్తులకు శిక్ష పడేలా ప్రయత్నించాలన్నారు.పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, అర్జీదారులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి లోపాలు లేకుండా విచారణ జరపాలన్నారు. మత్తుపదార్థాలు సేవించే వారికి, చిన్నచిన్న నేరాలు చేసేవారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు మంచి మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి,సారా అక్రమ రవాణాపై దృష్టి సారించి నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఎీస్పీ పంకజ్ కుమార్ మీనా, డీఎస్పీలు జి.సాయిప్రశాంత్,షేక్ సహబాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.