
నీ చెంతనే బతుకుతున్నాం.. కాపాడు తల్లీ..
తీరంలో గంగమ్మకు, నూకతాతకు ప్రత్యేక పూజలు
రాజయ్యపేటతీరంలో ఇసుక ప్రతిమలు చేసి పూజలు నిర్వహిస్తున్న మహిళలు (ఇన్‌సెట్) పసుపు కుంకుమలు కలిపిన నీళ్లను సముద్రంలో కలుపుతున్నమహిళలు
నక్కపల్లి(అనకాపల్లి) : ‘గంగమ్మతల్లీ నిన్నే నమ్ముకున్నాం.. నీ చెంతనే బతుకుతున్నాం.. నీవిచ్చిన మత్స్య సంపదే ఆధారం.. మమ్మల్ని బల్క్ డ్రగ్ పార్కు నుంచి కాపాడు తల్లీ’ అంటూ రాజయ్యపేట మత్స్యకార మహిళలు మంగళవారం తీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆరాధ్య దైవం నూక తాతపై కూడా భారం వేస్తూ వేడుకున్నారు. మంగళవారం ఉదయం వందలాది మంది మహిళలు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఇసుకతో గంగమ్మతల్లి, నూకతాత విగ్రహాలను తయారు చేశారు. వాటికి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. బిందెలతో నీళ్లు తెచ్చి పసుపు, కుంకుమ వేసి ఆ నీటిని, ఇసుకతో తయారు చేసిన విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేశారు. గంగమ్మతల్లి.. బల్క్ డ్రగ్ పార్క్ నీ నుంచి మమ్మల్ని దూరం చేయబోతోంది.. ఇంత కాలం నీ నీడలో బతుకుతున్నాం.. నువ్విచ్చిన సంపదతో కడుపు నింపుకొంటున్నాం.. నీ నుంచి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం ఒడిగడుతోంది.. నిన్ను కలుషితం చేయాలని చూస్తున్నారు.. నువ్వే కాపాడాలమ్మా అంటూ ప్రార్థించారు. ‘నూకతాతా.. ఇప్పటి వరకు ప్రతి ఏటా శివరాత్రికి నీ పండగ ఘనంగా చేసే వాళ్లం.. వచ్చే ఏడాది నుంచి ఆ పరిస్థితి ఉండదు. మా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలను బల్క్ డ్రగ్ పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.. మేమంతా పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పోయే పరిస్థితి కల్పిస్తోంది. నువ్వే దిక్కు మమ్మల్ని కాపాడాలి. నీపైనే భారం వేస్తున్నాం’ అంటూ వేడుకున్నారు. అలాగే గ్రామంలో ఉన్న బాకీర్తమ్మ అలయం వద్ద కూడా మహిళలు పూజలు చేశారు. అమ్మవారికి జలాశభిషేకం నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న మెట్టపై నీళ్లు పోసి అమ్మవారిని బల్క్ డ్రగ్ భూతం నుంచి కాపాడాలంటూ వేడుకున్నారు. ఈ పూజల్లో జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పైడితల్లి, మసేన మ్మ, పోలమ్మ, మహాలక్ష్మమ్మ, పాల్గొన్నారు.
బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేయాలంటూ మత్స్యకారుల వేడుకోలు

నీ చెంతనే బతుకుతున్నాం.. కాపాడు తల్లీ..