
ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్ ‘ఫైర్’
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో వివాదానికి కేంద్రమవుతోంది. ప్రైవేటు వ్యాపారాలకు యూనివర్సిటీ మైదానాన్ని లీజుకు ఇస్తుండడం ఏయూలో అగ్గి రాజేస్తోంది. తాజాగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ‘దివాళీ ట్రేడ్ ఫేర్’కు అనుమతి ఇచ్చే విషయంపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ఎనిమిది రోజుల పాటు మైదానాన్ని లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఏయూ వీసీకి లేఖ రాయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏయూ ఆడిటోరియాలు, మైదానాల్లో ప్రైవేటు కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ ఫెయిర్‌కు అనుమతులు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఈ దివాళీ ట్రేడ్ ఫెయిర్‌కు అనుమతులు ఇవ్వాలని ఏయూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మందుగుండు సామగ్రి స్టాళ్ల ఏర్పాటు పేరుతో కూటమి నేతలు భారీగా వసూళ్లకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
8 రోజుల అనుమతికి లేఖ
ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ క్రీడా మైదానంలో హెలీప్యాడ్ ప్రాంతంలో స్టాళ్ల ఏర్పాటుకు ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు 8 రోజుల పాటు లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ ఏయూ వీసీకి లేఖ రాశారు. ముందు నాలుగు రోజులు స్టాళ్ల ఏర్పాటుకు, మూడు రోజుల పాటు అమ్మకాలకు, మరో రోజు వాటి తొలగింపునకు మైదానాన్ని కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఈ అనుమతులపై ఏయూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేనట్లు సమాచారం. ఇటీవలే క్రెడాయ్ ఒక కార్యక్రమం నిర్వహణకు ఈ మైదానాన్ని లీజుకు కోరగా.. ఏయూ అధికారులు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు కార్యక్రమాలను ఏయూలో అనుమతి లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి క్రెడాయ్ కార్యక్రమాన్ని తిరస్కరించారు. ఇపుడు ఈ మందుగుండు సామాగ్రి అమ్మకాలకు ఎలా అనుమతులిచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
స్టాల్‌కు రూ.1.5 లక్ష నుంచి రూ.2 లక్షలు
ఏయూలో స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కూటమి నేతలు వసూళ్లకు తెరలేపారు. ఒక్కో స్టాల్‌కు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు రేటును నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఒక సొసైటీ పేరుతో అనుమతులకు దరఖాస్తు చేసినప్పటికీ.. తెరవెనుక కూటమి నేతలే చక్రం తిప్పాలని చూస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఏయూలో స్టాళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు సైతం రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏయూ గ్రౌండ్‌లో స్టాళ్ల ఏర్పాటుపై
గందరగోళం
8 రోజులకు అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ లేఖ
ఏయూ ఆడిటోరియాలు, మైదానాల్లో ప్రైవేటు కార్యక్రమాలు నిషేధం
అనుమతులు ఇచ్చే విషయంలో ఏయూ అధికారులపై ఒత్తిళ్లు
వసూళ్లకు తెరలేపిన కూటమి నేతలు