
ఆర్టీసీ ‘కార్తీక’ స్పెషల్స్
డాబాగార్డెన్స్(విశాఖ): పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు, పర్యాటకుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిల్లాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంచారామాలు, శబరిమలై దర్శనంతో పాటు లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు మంగళవారం వెల్లడించారు.
ఒకే రోజులో పంచారామాల దర్శనం
కార్తీక మాసంలో వచ్చే ప్రతి శని, ఆదివారాల్లో (ఈ నెల 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16) సాయంత్రం 5 గంటలకు విశాఖ ద్వారకా బస్టేషన్ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. అమరావతి (అమరేశ్వరస్వామి), భీమవరం (సోమేశ్వరస్వామి), పాలకొల్లు (క్షీర రామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం (భీమేశ్వరస్వామి), సామర్లకోట (కుమార రామలింగేశ్వరస్వామి) – ఈ ఐదు పంచారామాలను ఒకే రోజులో దర్శించుకునేలా ఈ సర్వీసులను నడపనున్నట్టు ఆయన తెలిపారు.
పంచారామాల ప్రయాణ చార్జీలు (ఒక్కరికి):
సూపర్ లగ్జరీ రూ. 2,200
అల్ట్రా డీలక్స్ రూ. 2,150
ఇంద్ర (ఏసీ) రూ. 2,800
లంబసింగి పిక్నిక్ టూర్
కార్తీక మాసంలో పిక్నిక్‌లకు వెళ్లే పర్యాటకుల కోసం లంబసింగి టూర్‌ను కూడా ఆర్టీసీ ప్రారంభించింది. ఈ టూర్ శని, ఆదివారాల్లో ఉదయం 3 గంటలకు ద్వారకా బస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మోదమాంబ గుడి, కాఫీ ప్లాంటేషన్ ప్రాంతాలను చూపించనున్నారు.
టూర్ చార్జీలు : అల్ట్రా డీలక్స్ రూ. 800, ఎక్స్‌ప్రెస్ – రూ. 650.
ధారమట్టం టూర్:
శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు ద్వారకా బస్టేషన్ నుంచి ధారమట్టం టూర్ బస్సులు బయలుదేరుతాయి. ఈ టూర్‌లో శివాలయం, ధారమట్టం వాటర్‌ఫాల్స్, అల్లూరి సీతారామరాజు మ్యూజియం, బొజ్జనకొండ (అనకాపల్లి) దర్శనీయ ప్రాంతాలు ఉంటాయి.
టూర్ ఛార్జీలు: సూపర్ లగ్జరీ – రూ. 650, అల్ట్రా డీలక్స్ – రూ. 550
శబరిమలై, ఇతర టూర్స్
శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. భక్తులు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకోవాలని డీపీటీఓ కోరారు. కార్తీక మాసంలో విజ్ఞాన విహార యాత్రలకు కూడా అద్దె ప్రాతిపదికన బస్సులు ఇవ్వనున్నామని, గ్రూపులుగా వచ్చినచో వారు కోరిన రోజున టూర్ స్పెషల్స్ నడపనున్నట్టు అప్పలనాయుడు తెలిపారు.
రిజర్వేషన్లు:
పంచారామ దర్శినీ, పిక్నిక్‌లు, మార్గశిర మాసంలో పంచవైష్ణవి క్షేత్ర దర్శనాల కోసం వెళ్లే భక్తులు www. apsrtconline. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ద్వారకా బస్టేషన్ వద్ద గల రిజర్వేషన్ కౌంటర్ వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు: 9959225602, 9052227083, 9959225594, 9100109731 నంబర్లలో సంప్రదించవచ్చు.
పంచారామాలు,
లంబసింగి టూర్ ప్యాకేజీలు