
గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆకస్మిక తనిఖీ
పెదబయలు: మండల కేంద్రం పెదబయలులోని స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సోమవారం రాత్రి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చెందిన రికార్డులు, ఉపాధ్యాయుల లెసన్ ప్లాన్‌ను పరిశీలించారు. అనంతరం మరుగుదొడ్లు పరిశీలించగా.. అపరిశుభ్రంగా, ఆధ్వానంగా ఉండి కంపు కొడుతుండడంతో పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌లపై డీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు ఇలా ఉంటే విద్యార్థులకు వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వార్డెన్‌ను హెచ్చరిస్తూ హెచ్‌ఎం, వార్డెలకు చార్జీ మెమోను జారీ చేశారు. అనంతరం ఏపీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల వసతి గృహంను తనిఖీ చేసి, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారీ సామర్థ్యంపై డీడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్లూవో స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.