
కొనసాగుతున్న హైవే బాధితుల ఆందోళన
● నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
● లేకుంటే ఆందోళన ఉధృతం
చేస్తామని హెచ్చరిక
జి.మాడుగుల: జాతీయ రహదారి 516ఈ నిర్మాణంలో నష్టపోయిన కాఫీ, మిరియం తోటల బాధిత రైతులు పరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఆదివారం కొనసాగింది. హైవే నిర్మాణంలో వంజరి, గెమ్మెలి పంచాయతీలకు చెందిన ములకాపుట్టు, వరిగెలపాలెం, కడగెడ్డ ప్రాంతాలకు చెందిన 78 మంది రైతులకు చెందిన కాఫీ, మిరియం, మామిడి, నిమ్మ, కమలాపండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మూడేళ్లు గడస్తున్నా కలెక్టర్, అధికారులు జరిగిన నష్టాన్ని పరిశీలించిన దాఖలాలు లేవని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాయితీ భూములకు కూడా ఇప్పటి వరకు పంట నష్టం చెల్లించకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించకుంటే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత సంఘ నేతలు వంజరి సీతారాంనాయుడు, శ్రీనివాసనాయుడు, పోతురాజునాయుడు, చిరంజీవినాయుడు, హరిబాబు, భాస్కరరావు, రాధాకృష్ణ, సన్యాసిదొర, పుష్పరత్నం, భారతమ్మ, చంద్రకళ, మోహన్‌రావు పాల్గొన్నారు.