
మెరుగైన వైద్యానికి బాలింతల నిరాకరణ
● కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌తో
అంగీకారం
● చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
సీలేరు: మెరుగైన వైద్యం కోసం ఇద్దరు బాలింతలు నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఎట్టకేలకు చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గూడెంకొత్తవీధి మండలంలోని దుప్పులవాడ పంచాయతీ బూసుకొండ గ్రామానికి చెందిన గొళ్లోరి రొయిల శనివారం స్థానిక ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది. అయితే తల్లి రొయిలకు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు పరీక్షల్లో నిర్థారణ అయింది. ఇదే పంచాయతీ వలస గెడ్డ గ్రామానికి చెందిన పాంగి సావిత్రి (29) కూడా ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 1.80 కిలోలు మాత్రమే ఉండటంతో వీరిద్దరిని మెరుగైన వైద్యం కోసం చింతూరు ఆస్పత్రికి తరలించాలని సిబ్బంది నిర్ణయించారు. ఇందుకు బాలింతలు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని వెంటనే ఎస్‌ఐ రవీంద్రకు తెలిపారు. వెంటనే ఆయన ఆస్పత్రికి వచ్చి వారి బంధువులతో మాట్లాడారు. కౌన్సెలింగ్ చేయడంతో చింతూరు ఆస్పత్రికి వెళ్లేందుకు అంగీకరించారు. వెంటనే వారిని అంబులెన్సులో ఆశా వర్కర్ సాయంతో చింతూరు పంపించారు.