
అరకు అందాల్లో తేలిపోదామా..
అరకులోయ టౌన్: పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో అందాల అరకులోయకు సందర్శకుల రాక మొదలైంది. వాతావరణ మార్పుల కారణంగా మంచు దట్టంగా కురుస్తుండటంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.
● అరకులోయ పద్మాపురం ఉద్యానవనంలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా ప్లే నిర్వాహకులు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంత సందర్శనకు వచ్చిన వారంతా హాట్ ఎయిర్ బెలూన్‌లో గాలిలో తేలిపోతూ ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. మరపురాని అనుభూతి పొందుతున్నారు.
● ఈ ఏడాది నిర్వాహకులు టికెట్ ధర కూడా తగ్గించారు. గతేడాది ఒకొక్కరికి రూ.1500 ఉన్న టికెట్ ధరను ఈఏడాది రూ.1200కు తగ్గించారు. వాతావరణంలో విండ్ బాగుంటే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించవచ్చు.
● పాడేరు ప్రాంతానికి చెందిన కొంత మంది గిరిజన నిరుద్యోగ యువత ఢిల్లీలోని గురుగామ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ నిర్వహణపై శిక్షణ పొందారు. మెగా ప్లే పేరిట హాట్ ఎయిర్ బెలూన్‌ను రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హాట్ ఎయిర్ బెలూన్‌ను ప్రారంభించినట్టు నిర్వాహకుడు సంతోష్ తెలిపారు.