
బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
జి.మాడుగుల: మండలంలో జాతీయ రహదారి బాధిత కాఫీ రైతులకు నష్టపరిహారం అందించాలని బాధిత సంఘ ప్రతినిధులు వంజరి సీతారాంనాయుడు, శ్రీనివాసనాయుడు డిమాండ్ చేశారు. మండలంలో వంజరి గ్రామంలో శనివారం హైవే రోడ్డు బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైవే నిర్మాణానికి సంబంధించిన వాహనాలను అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే రోడ్డు నిర్మాణంలో వంజరి, గెమ్మెలి పంచాయతీ ప్రజలకు సంబంధించిన కాఫీ, మిరియం తోటలకు నష్టం వాటిల్లిందన్నారు. వీరికి నష్టపరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు కార్యరూపం దాల్చలేదని అవేదన వ్యక్తం చేశారు. వంజరి, కడగెడ్డ, వరిగెలపాలెం, ములకాయపుట్టు గ్రామాలకు చెందిన గిరిజనులు కాఫీ, మిరియం తోటల ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారన్నారు. తోటలు నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
బాధిత సంఘ ప్రతినిధులు వంజరి సీతారాంనాయుడు, శ్రీనివాసనాయుడు డిమాండ్
లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం
హైవే నిర్మాణ పనుల వాహనాలనుఅడ్డగించి ఆందోళన