
‘బెర్రీ బోరర్’ నియంత్రణకు చర్యలు
సాక్షి, పాడేరు: కాఫీతోటలకు పెనుముప్పుగా మారిన బెర్రీబోరర్ పురుగు నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఐటీడీఏ కేంద్ర కాఫీబోర్డు, ఎఫ్‌పీవోలు, ఎన్‌జీవోతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్, కంటైన్‌మెంట్, బఫర్ జోన్లలో ఈ పురుగును నియంత్రించని పక్షంలో మొత్తం కాఫీ పంట నాశనమవుతుందని హెచ్చరించారు. బెర్రీబోరర్ సోకిన ప్రాంతాన్ని మూడేళ్ల పాటు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్‌వోపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. కింద పడిన కాఫీ కాయలకు గ్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పురుగు సోకిన ప్రాంతాల నుంచి కాఫీ పిక్కలు,టార్పాలిన్,గోనె సంచులను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని సూచించారు. పురుగు సోకని ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంటైన్‌మెంట్ జోన్‌లో రైతుల జాబితాను తక్షణమే తయారు చేయాలని,పురుగు సోకిన ప్రాంతంలోనే కాఫీ పల్పింగ్ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెర్రీబోరర్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని పంచాయతీల్లోను గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.ఈఏడాది కాఫీ నాణ్యతను పెంచేందుకు ఐటీడీఏ ద్వారా గ్రేడింగ్ చేస్తామని, వేరియబుల్ ధరను నిర్ధారించి చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో కేంద్ర కాఫీబోర్డు డీడీ మురళీధర, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, మినుములూరు ఎస్‌ఎల్‌వో రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై ప్రచారం
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త ధరల వల్ల కలిగే ఆర్థిక లాభాలను వివరించాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రూ.7,500 నుంచి రూ.7,000 లోపు ఉన్న హోటళ్ల గదుల అద్దెలు దాదాపు 10శాతం తగ్గుతాయని చెప్పారు అరకు, మారేడుమిల్లి, లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో రిసార్ట్‌లు, హోటళ్లు,చిన్న రెస్టారెంట్ల వద్ద పాత, కొత్త ధరలను పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక