
నేడు మత్స్య మాడుగులమ్మ దసరా ఉత్సవం
జి.మాడుగుల: స్థానిక గంతకొండపై కొలువై ఉన్న, మత్స్యరాస వంశీయుల ఇలువేల్పు అయిన మత్స్య మాడుగులమ్మ తల్లి గిరిజన దసరా పండగను మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రం జి.మాడుగులలో ఏటా రెండు సార్లు దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. సాధారణంగా అందరూ జరుపుకొనే ఆశ్వయుజ దశమి నాడు ఒకసారి, విజయ దశమి అనంతరం వచ్చే మొదటి లేదా రెండో మంగళవారం నాడు మరోసారి దసరా ఉత్సవం నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. గిరిజన దసరా పండగను మత్స్యరాస వంశీయులతో పాటు, ఈ ప్రాంత ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. పూర్వీకులు వినియోగించిన నాటు తుపాకీ, ఖడ్గం తదితర ఆయుధాలు, ఘటాలను దివంగత మాజీ ఎంపీ మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి మత్స్యరాస కుటుంబ సభ్యులు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా మత్స్య మాడుగులమ్మ ఆలయానికి తీసుకొచ్చి, గిరిజన సంప్రదాయం ప్రకారం ఆయుధ పూజ చేస్తారు. మత్స్యరాస వంశీయులతో పాటు ఈప్రాంతం ప్రజలు కూడా పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటారు.