
బడికెళ్లొచ్చే వరకూ బెంగే!
● గెడ్డదాటితేనే చదువులు
● నిత్యం విద్యార్థులకు తప్పని అవస్థలు
● వర్షం పడితే గండమే
● భయాందోళనలకు గురవుతున్న
తల్లిదండ్రులు
జి.మాడుగుల: మండలంలో బూసిపల్లికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లిరావాలంటే గెడ్డ దాటాల్సిందే. ఆ సమయంలో ఏ మాత్రం పట్టు తప్పినా గల్లంతవడం ఖాయం. దీంతో తీవ్ర భయాందోళనల మధ్య విద్యార్థులు తమ గ్రామం నుంచి వంజరి పంచాయతీ కృష్ణాపురానికి వెళ్లి చదువుకోవలసి వస్తోంది. రోజూ మాదిరిగానే బూసుపల్లి గ్రామం నుంచి సోమవారం ఉదయం కృష్ణాపురంలో గల పాఠశాలకు విద్యార్థులు వెళ్లారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో మార్గమధ్యంలో గల గెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఇళ్లకు చేరుకునేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. పొలాల గట్లపై జారుతూ,పడుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటుతూ వస్తున్న విద్యార్థులను చూసిన బూసిపల్లి గ్రామస్తులు వారికి రక్షణగా నిలిచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణాపురం పాఠశాలలో బూసిపల్లి,నీలమెట్ట, తోకచిలుక గ్రామాలకు చెందిన 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణాపురం–బూసిపల్లి మార్గ మధ్యంలో గల గెడ్డ వర్షాలు పడితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రెండు గ్రామాల మధ్య 2కిలోమీటర్లు రోడ్డు, గెడ్డపై బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా పట్టించుకోలేదు. దీంతో బడికి వెళ్లిన పిల్లలు ఇళ్లకు చేరే వరకూ తల్లిదండ్రులు భయాందోళనలతో ఎదురుచూడాల్సి వస్తోంది.
ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలోంచి చిన్నారులను సురక్షితంగా తీసుకొస్తున్న గ్రామస్తులు