
నేడు ఉద్యమ నేత ఏలియా సంస్మరణ సభ
పాడేరు : ప్రజా ఉద్యమ నేత, డీఎల్వో, జీఎస్‌యూ, ఓపీజీఆర్ సంఘాల వ్యవస్థాపకుడు, రిటైర్డ్ హెచ్‌ఎం డాక్టర్ చెండా ఏలియ సంస్మరణ సభ ఆదివారం ఉదయం పాడేరు మోదకొండమ్మ తల్లి ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు డీఎల్వో రాష్ట్ర నాయకులు సీహెచ్ కేశవరావు, సమరెడ్డి మాణిక్యం తెలిపారు. శనివారం పట్టణంలోని డీఎల్వో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కాశీం, గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలక్క, ఒరిస్సా రాష్ట్ర మాజీ మంత్రి జయరాం పాంగి, స్థానిక ఎమ్మెల్యేలు మత్య్సరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్య్సలింగం, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ సంస్మరణ సభకు అన్ని గిరిజన, ప్రజా, ఉద్యమ, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నేతలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.