
సమస్యల పరిష్కారం వేగవంతం
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 137 అర్జీల స్వీకరణ
పాడేరు : ప్రజా సమస్యలపై అందే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, జేసీ అభిషేక్ గౌడ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ 137 వినతులు స్వీకరించారు. ఆర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కాల్ సెంటర్ నంబర్‌కు ఫోన్ చేసి అర్జీ పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఆర్డీఏ పీడీ మురళి, డీపీవో చంద్రశేఖర్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
పాడేరు మండలం డి.గొందూరు పంచాయతీ బొడ్డుమామిడిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని సర్పంచ్ సీదరి రాంబాబు వినతిపత్రం అందజేశారు.
● అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ వై.కొతవలస గ్రామానికి చెందిన జ్యోతి, లక్ష్మి, కమల తమకు ఆశా కార్యకర్తలుగా ఉద్యోగ అవకాశం కల్పించాలని అర్జీ ఇచ్చారు.
● అరకువ్యాలీ మండలం సుంకరమెట్ట పంచాయతీ పిరిబందలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో భవనం మంజూరు చేయాలని సర్పంచ్ చినబాబు అధికారులను కోరారు.
● గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడకు చెందిన సురేష్ రేషన్ కార్డు మంజూరు చేయాలని , పెదబయలు మండలం మారుమూల ఇంజరి పంచాయతీ సాలెబుల గ్రామానికి చెందిన రంగారావు తమ గ్రామంలో కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మించాలని అర్జీ అందజేశారు.
● దేవీపట్నం మండలం తన్మూరు పంచాయతీ కె.గొందూరుకు చెందిన శ్రీకృష్ణ, రాములు, సోములమ్మ తమ డి.ఫారం పట్టాకు నష్టపరిహారం కోసం వినతిపత్రం ఇచ్చారు.

సమస్యల పరిష్కారం వేగవంతం