
ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను దూరం చేసే ప్రయత్నం
చింతపల్లి : ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేసే ప్రయత్నాన్ని విరమించుకోకుంటే మరో అల్లూరి విప్లవానికి గిరిజనుల సిద్ధం కావలసి వస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్యపడాల్ హెచ్చరించారు. శుక్రవారం గూడెం కొత్తవీధి మండల కార్యదర్శితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి హైడ్రోపవర్ ప్రాజెక్టు ఒప్పందాలను ,రద్దు చేసుకోవాలని సీపీఎం రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ప్రాంత గిరిజనానికి ఒక్క శాతం ఉపయోగం లేకపోగా ఆదీవాసి ప్రజలు తాము నమ్ముకున్న అడవులకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టులు నిర్మా ణాలు చేపడితే ఎనిమిది మండలాల పరిధిలో గల 250 గ్రామాలకు సంబంధించి 50వేల మంది గిరిజనుల జీవన పరిస్థితులు తారుమారు కావడంతో పాటు 20 వేల ఎకరాలు అటవీ వ్యవసాయ భూమి జల సమాధి అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఉల్లంఘించి కార్పొరేట్ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కనకవల్లి పాల్గొన్నారు.