చింతపల్లి: గిరిజన రైతాంగం ఉద్యానవన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని విశాఖ పోర్టు అథారిటీ ఉద్యానవన జీఎండీ రాధిక సూచించారు. మంగళవారం విశాఖ పోర్టు అథారిటీ, విశాఖ జిల్లా నవనిర్మాణ సంస్థ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని వాముగెడ్డ, చీకటిమామిడి, పినకొత్తూరులో గిరిజన రైతులకు 3,500 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గిరి రైతులకు ఉద్యానవన పంటలతో పాటు కాఫీసాగుకు అనువుగా ఉండేలా మామిడి, చింత, బాదం, నేరేడు, సీతాఫలం, సపోటా, వేప మొక్కలు అందిస్తున్నామన్నారు. వీటి పెంపకం ద్వారా గిరిజన రైతులు రానున్న రోజుల్లో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు నవనిర్మాణ సంస్థ చొరవ చూపాలని ఆ సంస్థ సీనియర్ మేనేజర్ కుమార్‌ను గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు అథారిటీ సీనియర్ వీవీ సాంబమూర్తి, ఉద్యానవన అధికారి భాస్కర్, గిరిజన సంఘ మండల అధ్యక్షుడు సాగిన చిరంజీవి పడాల్ పాల్గొన్నారు.