
108లో ప్రసవం
ఎటపాక: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా 108లో ప్రసవించిన ఘటన మంగళవారం ఎటపాక మండలం గుండాల గ్రామ సమీపంలో జరిగింది. కుసుమనపల్లి గ్రామానికి చెందిన గుండి శ్యామలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే గోదావరి వరద రహదారిని ముంచెత్తడంతో తోటపల్లి నుంచి నెల్లిపాక మీదుగా భద్రాచలం వెళ్లేందుకు రహదారి లేదు. దీంతో పండువారిగూడెం నుంచి రామగోపాలపురం వెళ్లి అక్కడ నుంచి భద్రాచలం తీసుకెళ్తుండగా గుండాల గ్రామం సమీపంలో శ్యామలకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని రహదారి పక్కన నిలిపి ఆశా కార్యకర్త సాయంతో ఈఎంటీ లక్ష్మణ్‌సింగ్, పైలట్ మహేష్ గర్భిణికి ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డను ప్రసవించింది. బిడ్డ, తల్లి క్షేమంగా ఉండడంతో చికిత్స కోసం భద్రాచలం తరలించారు.