
సమ్మగిరిలో కదంతొక్కిన గిరిజనం
● హైడ్రోపవర్ ప్రాజెక్టుల అనుమతి రద్దు చేయాలని డిమాండ్
● లేకుంటే పోరాటం కొనసాగిస్తాం
● సీపీఎం జిల్లా కార్యదర్శి
అప్పలనర్సయ్య హెచ్చరిక
చింతపల్లి: హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్సయ్య హెచ్చరించారు. మంగళవారం అరణ్య గర్జన జీపు జాతా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మండలంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు కానున్న సమ్మగిరి ప్రాంతంలో పర్యటించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాపకింద నీరులా ఆదివాసీలను అడవులకు దూరంచేసే కుట్రకు సిద్ధమయ్యయన్నారు. చింతపల్లి–కొయ్యూరు మండలాల సరిహద్దులోని ఎర్రవరం ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు తీవ్రమైన పోరాటం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. గ్రామసభ, మండల, జిల్లా కమిటీల తీర్మానాలను పట్టించుకోకుండా ఫీజుబిలిటీ రిపోర్టు తయారు చేశారన్నారు. ఆదివాసీల జీవనోపాధి, సంస్కృతీ సంప్రదాయాలను కాలగర్భంలో కలిపేసేలా అడవులను నాశనం చేసేందుకు కుట్రపూరితంగా వ్యహరిస్తున్నాయని ఆరోపించారు. మన్యంలో ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో సుమారు పది వేల ఎకరాలు నాశనం కావడంతో పాటు 250 గ్రామాలు ఖాళీ అవుతాయన్నారు. అంతేకాకుండా 50 వేల మంది ఆదివాసీలు నిర్వాసితులుగా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు.సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ అడవి, భూమిపై హక్కు గిరిజనులకే ఉన్నప్పుడు ఆ భూమిని అమ్మే హక్కు ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బలమైన గిరిజన చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలకు చుట్టాలుగా మారిపోయాయని దుయ్యబెట్టారు.ఈ కార్యక్రమంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గూడెపు రాజు, ఎంపీటీసీ మోహనరావు, మాజీ సర్పంచ్ బెన్నాస్వామి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, సీపీఎం నేతలు త్రినాథ్, ధర్మన్నపడాల్, సింహాద్రి, ఎర్రబొమ్మలు ఉప సర్పంచ్ సోమరాజు, గొందిపాకులు,ఎర్రబొమ్మలు పంచాయతీల పరిధిలోని గిరిజనులు పాల్గొన్నారు.