
కాఫీ విలవిల
కాయలకు తీవ్ర నష్టం
154 చోట్ల 1844 ఎకరాలకు
వ్యాప్తి
పురుగు తీవ్రత ఉన్న 85 ఎకరాలు రెడ్ జోన్‌గా అప్రమత్తం
నివారణకు 3 వేల ఎకరాల్లో
ట్రాప్‌ల ఏర్పాటు
కాఫీ తోటలకు చాపకింద నీరులా బెర్రీబోరర్ (కాయతొలుచు పురుగు) ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తుండటంతో రైతులు కలవరం చెందుతున్నారు. జిల్లాలో ఈ పురుగు ప్రభావాన్ని అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో గుర్తించిన అధికార యంత్రాగం, శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో సర్వే ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 85 ఎకరాల్లో పురుగు తీవ్రతను గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. మరో 1759 ఎకరాల్లో పురుగు ప్రభావం ఉన్నట్టుగా నిర్థారించి నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
సమగ్ర సస్యరక్షణపై దృష్టి
అరకులోయ టౌన్ : పాడేరు డివిజన్‌లో గిరిజన రైతులకు కాఫీ తోటలు ప్రధాన ఆదాయ వనరు. ఏటా నిలకడగా ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో పాడేరు, అరకువ్యాలీ, చింతపల్లి ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 40 వేల ఎకరాల్లో పంటను విస్తరించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇలా సాగు విస్తరణకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంటే మరోపక్క బెర్రీబోరర్ కాఫీ కాయలకు ఆశించి తీవ్ర నష్టం కలుగజేస్తోంది.
● పురుగు ప్రభావం ఎక్కువగా ఉన్న అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో ఇప్పటివరకు 154 చోట్ల 1844 ఎకరాల్లో బెర్రీబోరర్ సోకినట్టు కాఫీ అధికారులు గుర్తించారు. రెడ్, ఎల్లో, ఆరంజ్ జోన్లుగా వీటిని విభజించి నివారణకు అవసరమైన సూచనలను రైతులకు అందిస్తున్నారు.
రెడ్ జోన్‌లో 85 ఎకరాలు..
పురుగు ప్రభావం ఉన్న 1844 ఎకరాల్లో 85 ఎకరాల్లో తీవ్ర నష్టం జరిగినట్టు గుర్తించారు. ఈ తోటలను రెడ్‌జోన్‌లో చేర్చారు. మిగిలిన 1759 ఎకరాలను ఎల్లో, ఆరంజ్ జోన్లుగా అధికారులు నిర్ణయించారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన 85 ఎకరాల కాఫీ తోటల్లో కాఫీ కాయలను తొలగించినట్టు కాఫీ బోర్డు, పాడేరు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. పురుగు వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తొలగించిన కాయలను గోతులు తవ్వి పూడ్చి పెడుతున్నట్టు వారు వివరించారు.
నష్టం..వ్యాప్తి ఇలా..
బెర్రీ బోరర్ (కాయతొలుచు పురుగు) కాఫీ పూతకు వచ్చిన 150 రోజుల తరువాత చిన్న మరియు అభివృద్ధి చెందిన కాయలపై దాడి చేస్తుంది. సాధారణంగా ఆగస్టు నుంచి కాఫీ పండ్లు కోసే సమయం వరకు, నేల రాలిన కాయల్లో, కాఫీ కాయల కొన వద్ద, ముచ్చిక ప్రాంతంలో సూదితో గుచ్చినట్లుగా రంధ్రం ఏర్పరుస్తుంది. గింజలోకి ప్రవేశించి, గుజ్జును తింటుంది మరియు దాని మలంతో సొరంగాలను చేస్తుంది. తీవ్రస్థాయిలో ముట్టడిస్తే 80 శాతం వరకు పంట నష్టం జరుగుతుంది.
● ఈ పురుగు ప్రధానంగా కీటకం సోకిన ప్రాంతాల నుంచి సేకరించిన విత్తన కాఫీ, పురుగు ఆశించిన తోటల నుంచి కాఫీ పండ్ల సేకరణకు ఉపయోగించే గోనె సంచులు లేదా కాఫీ క్యూరింగ్ యూనిట్ల నుంచి వ్యాపిస్తుంది. ఈ పురుగు ముట్టడి గతంలో లేదు. గత ఆగస్టులో అరకువ్యాలీ ప్రాంతంలోని అరబికా, రోబస్టా రకం కాఫీ తోటల్లో గుర్తించారు.
సంక్రాంతి పండగకు ఇబ్బందే
బెర్రీ బోరర్ పురుగు సోకడంతో కాయలను కాఫీ బోర్డు అధికారులు మొత్తం తీయించి వేడినీటిలో మరగబెట్టి, గొయ్యి తీసి పూడ్చివేయించారు. దీంతో ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. సంక్రాంతి పండగకు ఆర్థిక ఇబ్బందులు తప్పేట్టు లేవు.
– స్వాభి మొయిన, పకనకుడి, అరకులోయ
నాలుగు ఎకరాలూ రెడ్‌జోన్
ఈ ఏడాది మొత్తం 4 ఎకరాల్లో బెర్రీబోరర్ పురుగు సోకి కాఫీ కాయలకు తీవ్ర నష్టం కలుగజేసింది. జరిగిన నష్టం తీవ్రతను గుర్తించిన అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. నాలుగు ఎకరాల్లో ఎర్ర జెండా పాతిపెట్టారు.
– స్వాభి లచ్చు, మహిళ రైతు, పకనకుడి
మొత్తం ఫలసాయం తొలగింపు
కాయతొలుచు పురుగు సోక డం వల్ల రెండు ఎకరాల కాఫీ తోటలో కొమ్మల వద్ద కాఫీ కాయలు, పండ్లతోపాటు పూత ను మొత్తం తొలగిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి కాపు రాదనే బాధ కలుగుతోంది. బాధిత కాఫీ రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలి.
– స్వాభి డొంబు, పకనకుడి, అరకులోయ
ఎకరాకు రూ.లక్ష ఇవ్వాలి
నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. లక్ష చొప్పున ప్రభు త్వం నష్ట పరిహారం ఇవ్వాలి. కిలో కాఫీ కాయలకు కేవలం రూ. 50 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా కాకుండా ఎకరాకు రూ. లక్ష నష్ట పరిహారం అందజేసి ప్రభుత్వం న్యాయం చేయాలి.
– బిసోయి జగన్నాథం, మాలిశింగారం
పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎకరాకు పది చొప్పున 3 వేల ఎకరాల్లో ట్రాప్స్ ఏర్పాటుచేశారు.
అరకులోయ మండలంలో పకనకుడి, మాలిసింగారం, మాలివలస, చినలబుడు, తురాయిగుడ, బోడుగుడ, ఇరగాయి ప్రాంతాల్లో పురుగు తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ తోటలను రెడ్‌జోన్‌లో చేర్చారు.
డుంబ్రిగుడ మండలంలో డుంబ్రిగుడ, కుర్రాయి ప్రాంతాల్లో పురుగు వ్యాప్తిని గుర్తించిన అధికారులు రైతులు అప్రమత్తం చేశారు.
క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తల అధ్యయనం: కాఫీలో బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి, దాని స్థితిని అంచనా వేసేందుకు బాపట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కీటక శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు, కీటక శాస్త్ర ఆచార్యులు డాక్టర్ టి.మధుమతి, పాథాలజీ విభాగ అధిపతి డాక్టర్ జి.వంశీ కృష్ణ, ఉద్యాన విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.దుర్గ, హేమంత్ కుమార్ నేతృత్వంలో వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు కాఫీ తోటలపై అధ్యయనం చేస్తున్నారు. బివేరియా బిసియానా అనే సేంద్రియ కీటక నాశిని ఎకరానికి ఒక కిలో చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కీటక నాశిని పిచికారీ చేసిన తరువాత కాయలను సాధారణంగా వాడుకోవచ్చని వారు తెలిపారు.
కాఫీ తోటలో పురుగు నివారణకు ఏర్పాటుచేసిన ట్రాప్

కాఫీ విలవిల

కాఫీ విలవిల

కాఫీ విలవిల

కాఫీ విలవిల

కాఫీ విలవిల

కాఫీ విలవిల