
ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు
రాజవొమ్మంగి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోడాన్ని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్(అనంతబాబు), రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఎండగట్టారు. రాజవొమ్మంగిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు మరచిపోయారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పోలిటిక్స్ నడుపుతున్నారని, ప్రజాసంక్షేమం గాలికి వదిలి పెట్టారని విమర్శించారు. మేనిఫెస్టో అంటూ నాడు ఇంటింటికి బాండ్స్ పంచిపెట్టారని, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కనపడేశారన్నారు. ప్రజాసమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల చొప్పున ఇప్పటివరకు 14 నెలలకు గాను ఒక్కొక్కరికి రూ.42వేలు చెల్లించాలన్నారు. గతేడాదికి చెందిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం సొమ్మును తక్షణమే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేయాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం మాజీ ఎమ్మల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో హామీలిచ్చిన అన్ని పథకాలను సంపూర్ణంగా అమలుచేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచామన్నారు.
నాడు జగన్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలకు పేర్లు మార్చి నేడు కూటమి ప్రభుత్వం అరకొరగా అమలుచేస్తూ ప్రకటనల్లో గొప్పగా చెప్పకోవడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించి, చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతోందని, అధికారులు, పోలీసులు కూడా యంత్రాంగం మాట విని తప్పుదోవ పడుతున్నారన్నార. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతుందన్నారు. పార్టీ కార్యకర్తలను పోలీసుస్టేషన్‌లకు పిలిచి రోజుంతా ఉంచుతున్నట్టు తనకు దృష్టికి వచ్చిందని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారు. తప్పుచేస్తే కేసు పెట్టి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, అలా కాకుండా స్లేషన్‌కు పిలిచి రోజుంతా ఉంచడం తగదన్నారు. కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలకు సంబంధించిన సమాచారంతో కూడిన క్యూఆర్ కోడ్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మాట్లాడుతూ చంద్రబాబు అరాచక పాలనపై ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి. జిల్లా కార్యదర్శి వెంకటేష్‌రాజు, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, చీడి శివ, ఆగూరి శుభలక్ష్మి, సవిరెల చంద్రుడు, మిరియాల గణలక్ష్మి, కించు వెంకటలక్ష్మి, భీంరెడ్డి శుభలక్ష్మి. ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరి, చంద్రరాణి, గంగదుర్గ, లోవలక్ష్మి, నిర్మలదేవి, నాయకులు నాగులపల్లి కుశరాజు, చింతలపూడి వెంకటరమణ, బొడ్డు వెంకటరమణ. జుర్రా జాన్‌బాబు. ఆధ్య రమేష్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్,
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు