
ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాల్సిందే
అరకులోయ టౌన్: ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 9వ తేదీన ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీపై ప్రకటన చేయాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని శరభగుడలో ఆ సంఘ మండల ఉపాధ్యక్షుడు కిల్లో జగన్నాథం అధ్యక్షతన ఆదివాసీ గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బాలదేవ్ మాట్లాడారు. ఈనెల 9వ తేదీ వరకు ఆదివాసీంతా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. షెడ్యూల్ ఏరియాలో 1/70 భూబదలాయింపు చట్టం, పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. జిల్లాలోని అనంతగిరి, చింతపల్లి మండలాల్లో పెదకోట, గుజ్జిలి, చిట్టంపాడు, ఎర్రవరం ప్రాంతాల్లో అదానీ, నవయుగ ప్రైవేట్ కంపెనీలకు హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతిస్తూ ఇచ్చిన జీవో నంబరు 51 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కె. మగ్గన్న, ఆనంద్, గోపి, ప్రసాద్, పరశురామ్, కళ్యాణ్, లక్ష్మణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ డిమాండ్