
ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్
జి.మాడుగుల: ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ అధ్వర్యంలో మండల కేంద్రంలో లయ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో శనివారం మండల సదస్సు జరిగింది. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ సాగిన ధర్మన్నపడాల్, పాడేరు జోనల్ కమిటీ కన్వీనర్ మత్స్యరాస నారాయణరాజు మాట్లాడుతూ గత నెల 20 నుంచి ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ అధ్వర్యంలో దఫదఫాలుగా ఉద్యమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
నూతన కమిటీ ఎన్నిక
మండల స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్‌గా లకే రామకృష్ణ ఎన్నికయ్యారు. ముఖ్యసలహాదారులుగా కోటిబాబు, గణేష్ మాష్టర్, మత్స్యరాస మత్స్యరాజు మాష్టర్, కో కన్వీనర్‌గా మత్స్యరాజు, ఈశ్వరరావు, ప్రసాదరావు, మల్లేశ్వరరావు, మత్స్యకొండంనాయుడు, సన్యాసిదొర, సూరిపడాల్, లక్ష్మణ్, జల్లి చిన్ని ఎన్నికయ్యారు.
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం చేపట్టిన రిలే దీక్షకు పీడీలు, పీఈటీలు అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు.ఆదివాసీ జేఏసీ కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న రిలే దీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు చేసి ప్రారంభించారు. ఏజెన్సీలో టీచర్ పోస్టులను నూరు శాతం ఆదివాసీ అభ్యర్థులచే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్–3కు చట్టబద్దత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలన్నారు. ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారావు పాల్గొన్నారు.
కూనవరం: అయిదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వం వంద శాతం ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కూటూరు పంచాయతీలో ఆ సంఘం నాయకులు శనివారం వీఆర్‌వో బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు పాయం సీతారామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ నుంచి ఏజన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి, ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి గిరిజన అభ్యర్థులతో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్–3ని కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సర్పంచ్ బి.వెంకమ్మ, మేకల నాగేశ్వరరావు, నూపరాజు, సోడె శ్రీరాములు, చిచ్చడి రాజయ్య, నూప రమణయ్య, కారం కన్నారావు, పాయం శేఖర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్

ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్