
రైలు నుంచి జారిపడి విద్యార్థి మృతి
తుని: స్థానిక జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుల్లిపాడు–నర్సీపట్నం రోడ్డు మధ్యలో రైలు నుంచి జారిపడి సీలేరుకు చెందిన విద్యార్థి మృతి చెందినట్టు ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుడి దగ్గర లభించిన సెల్ ఫోన్ ఆధారంగా సీలేరులో ఉంటున్న తండ్రి ఎస్.కె.ఆలీకి సమాచారం ఇచ్చారు. ముగ్గురు కుమారులు కాగా, మృతుడు ఆషిక్ పెద్ద కుమారుడని తెలిపారు. శనివారం తమకు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ప్రకారం..అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరుకు చెందిన ఎస్‌కె.ఆషిక్ తుని మండలం తాళ్లూరులో ఉంటున్న పెదనాన్న ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో విశాఖ
పట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సీలేరులోని 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ విశాఖలోని ఏబీఎన్ కళాశాలలో చదువుతున్నాడని, చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.