కారు ఢీకొని దివీస్‌ ఉద్యోగిని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని దివీస్‌ ఉద్యోగిని దుర్మరణం

May 25 2025 7:21 AM | Updated on May 25 2025 7:21 AM

కారు

కారు ఢీకొని దివీస్‌ ఉద్యోగిని దుర్మరణం

తగరపువలస: సంగివలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా చాట్రాయ్‌ మండలం ఎర్రవారిగూడేనికి చెందిన ఉప్పలపాటి తిరుమలాదేవి (24) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన పిల్లి వెంకటేష్‌ ఫార్‌ుచ్యనర్‌ కారులో కాకినాడ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వైపు వెళ్తున్నారు. కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో సంగివలస ముగ్గురు అమ్మవార్ల ఆలయం సమీపంలో అదుపు తప్పిన డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. కాగా.. భీమిలి మండలం చిప్పాడలోని దివీస్‌ లేబొరేటరీలో కెమిస్ట్‌గా పనిచేస్తున్న తిరుమలాదేవి విధులకు హాజరయ్యేందుకు మరో ముగ్గురు సహోద్యోగినులతో కలిసి అనిట్స్‌ బస్టాప్‌ వద్దకు చేరుకుంది. తాము ఎక్కాల్సిన ప్రైవేట్‌ బస్సు అప్పటికే ఆనందపురం వైపు వెళ్లిపోయింది. ఆనందపురం వైపు నుంచి తిరిగి వస్తున్న అదే బస్సును పట్టుకోవడానికి ఆమె రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు తిరుమలాదేవిని బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల ఛిద్రమై తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మిగతా ముగ్గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుమలాదేవి మూడేళ్లుగా దివీస్‌లో కెమిస్ట్‌గా పనిచేస్తున్నారు. సంగివలసలోని ఆరాధ్య హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. సమాచారం అందుకున్న భీమిలి ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయంపై దివీస్‌ యాజమాన్యానికి, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దివీస్‌ ఉద్యోగి కడియాల పవన్‌కుమార్‌ ఫిర్యాదుతో ఎస్‌ఐ రాధాకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని దివీస్‌ ఉద్యోగిని దుర్మరణం1
1/1

కారు ఢీకొని దివీస్‌ ఉద్యోగిని దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement