
ఏయూలో ‘అతిథి’పోరు
● గెస్ట్ ఫ్యాకెల్టీల తొలగింపునకు కసరత్తు ● కొంపముంచిన కూటమి నేతల సిఫార్సు ● పాఠాలు చెప్పే ఫ్యాకల్టీలకు తప్పని పరీక్ష
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులపై వర్సిటీ పాలనాధికారులు చిన్నచూపు చూస్తున్నారా..? నెలవారీ వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ మరుగునపడేలా అతిథి అధ్యాపకులకు బోధనా సామర్థ్యానికి పరీక్ష పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారా...?. వచ్చే విద్యా సంవత్సరంలో గెస్ట్ ఫ్యాకెల్టీలను సగానికి పైగా తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారా..?. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో ఏయూలో ఇదే చర్చసాగుతోంది. పీహెచ్‌డీ అర్హతలతో ఏళ్ల తరబడి పాఠాలు చెబుతున్న తమను అవమానపరిచేలా వర్సిటీ పాలానాధికారుల వ్యవహరిస్తున్న తీరుపై అతిఽథి అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై శనివారం వర్సిటీ ప్రాంగణంలో సమావేశమైన అతిథి అధ్యాపకులు, దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు చేశారు.
ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత
ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు 1,200 మంది వరకు ఉన్న రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం 200 లోపుకి చేరుకుంది. దీంతో తరగతుల నిర్వహణ కోసం దాదాపు 400 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను, మరో 160 మంది కాంట్రాక్ట్ మరియు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ హోదాల్లో పనిచేస్తున్నారు. క్యాంపస్ విద్యలో వీరి పాత్ర ముఖ్యమైనప్పటికీ, వర్సిటీ పాలనాధికారుల వైఖరి పట్ల అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏయూలోనే ఎందుకలా..
రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలు యూజీసీ నిబంధనల ప్రకారం గెస్ట్ ఫ్యాకల్టీలకు నెలకు రూ.45,000 వరకు వేతనాలు చెల్లిస్తుండగా, ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం సెమిస్టర్‌కు రూ.45,500 మాత్రమే ఇస్తున్నారు. ఇది నెలకు రూ.7,500 నుంచి రూ.15,000 మధ్య ఉంటుంది. అంతేకాకుండా, ఈ వేతనాలు కూడా ఆలస్యంగా అందుతున్నాయని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. ఇతర చోట్ల నెలకు రూ.50,000 వరకు వేతనం పొందుతుంటే, ఏయూలో తమకు ఎందుకు తక్కువ ఇస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేదని వారు చెబుతున్నారు.
సిఫార్సు ఫ్యాకెల్టీలతోనే చిక్కులు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్సిటీ పునరావాస కేంద్రంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు నాయకుల సిఫార్సులతో అవసరం లేకున్నా గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించారని, ఇప్పుడు వారిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. పీజీ, పీహెచ్‌డీ అర్హతలు కలిగి ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను ఇలా అవమానించడం సరికాదని అధ్యాపకులు అంటున్నారు.
నెలవారీ వేతనాలు ఇవ్వాలి
గెస్ట్ ఫ్యాకల్టీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ సురేష్ మీనన్ మాట్లాడుతూ, విద్యార్థుల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. సిక్‌మెన్ కమిటీ ద్వారా ఎంపికై న తమను అర్హతలు లేని వారిలా చూడటం బాధాకరమన్నారు. అర్హతలు లేని వారిని తొలగించవచ్చని, కానీ అర్హులైన తమకు కూడా ఇతర విశ్వవిద్యాలయాల మాదిరిగా నెలవారీ వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.