తుపాకుల మోత | - | Sakshi
Sakshi News home page

తుపాకుల మోత

Published Thu, May 8 2025 7:51 AM | Last Updated on Thu, May 8 2025 7:51 AM

తుపాక

తుపాకుల మోత

పచ్చని కొండల్లో

రంపచోడవరం: అల్లూరి మన్యంలో పోలీసు తుపాకులు గర్జించాయి. పచ్చని కొండలు కాల్పులతో దద్దరిల్లాయి. వై రామవరం మండలం శేషరాయి వద్ద అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌ ఉన్నారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు జగన్‌ ఇటీవల పాతకోట, గుర్తేడు పరిసర ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మావోయిస్టు జగన్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబరుగా, పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇతనిపై రూ. 20 లక్షల పోలీసు రివార్డు ఉంది. మృతి చెందిన మరో మావోయిస్టు రమేష్‌ డీసీఎం క్యాడర్‌లో పనిచేస్తున్నారు.

గాలిస్తున్న బలగాలు

ఎదురు కాల్పుల్లో ఇద్దరితోపాటు మరికొందరు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్న పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టులపై అణచివేత ఎక్కువ కావడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)ను సేఫ్‌ జోన్‌గా భావించిన మావోయిస్టుల సంచారం అల్లూరి జిల్లా సరిహద్దులో ఎక్కువైంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పట్టు కోల్పోవడంతో తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు లోతట్టు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు గట్టి సమాచార వ్యవస్థతో వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టి అప్రమత్తమవుతూ కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఎన్నో ఏళ్లుగా మారేడుమిల్లిలో నిర్వహిస్తున్న గుర్తేడు పోలీసుస్టేషన్‌ను గుర్తేడులో ఏర్పాటు చేసి అక్కడ నుంచి పోలీసులు తమ కార్యక్రమాలను విస్తృతం చేశారు. దీనిలో భాగంగా ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎంతో కాలంగా పూర్తికాని కొన్ని కీలకమైన రోడ్లను పూర్తి చేసేందుకు పోలీస్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే పాతకోట– మంగంపాడు, పోతవరం– వై రామవరం, బొడ్డగండి– డొంకరాయి తదితర రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

విద్యార్థి దశ నుంచే ఉద్యమంలోకి...

సీలేరు: కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌. అలియాస్‌ అండు.. అలియాస్‌ బీరును. అలియాస్‌ బీమ ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి మావోయిస్టు పార్టీలో కీలక నేత. పాఠశాలలో చదువుకుంటున్న తరుణంలో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 30 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగాడు. ఆయనది గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములవాడ. తల్లి పేరు సీతమ్మ. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు సోమన్న ఇప్పటికే మృతి చెందగా రెండవ కొడుకు కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉంటూ ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మూడో కొడుకు అప్పన్న ప్రస్తుతం స్వగ్రామం కొమ్ములువాడలో ఉంటున్నారు.

తల్లి వేడుకున్నా..

ఏడాది క్రితం తల్లి సీతమ్మ మృతి చెందింది. ఆమెకు పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఎన్నోసార్లు కొడుకుని చూడాలని.. ఉద్యమాన్ని వీడి రావాలని వేడుకున్నా జగన్‌ రాలేదు. పోలీస్‌ శాఖ పలుమార్లు లొంగిపోవాలని, పునరావాసం కల్పిస్తామని ప్రకటన చేసినా ఆయన ఉద్యమం నుంచి బయటకు రాలేదు. ఆయన వయసు 65 సంవత్సరాలు పైబడి ఉంటుందని పోలీసులు గతంలోరే నిర్థారించారు. ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గడ్‌ సరిహద్దు అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్న పండన్న పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. 2021లో తీగల మెట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో అతను తప్పించుకున్నట్లు పోలీస్‌ రికార్డులో నమోదయింది. తల్లి మృతి చెందాక.. ఐదు నెలల క్రితం పండన్న తన అనుచరులతో స్వగ్రామమైన కొమ్ములవాడ గ్రామానికి వచ్చి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి భోజనం చేసి వెళ్లాడు. ఇది తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టి నప్పటికీ వారి కంట పడకుండా తప్పించుకున్నాడు. అప్పట్నుంచి కాకూరి పండన్నను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈనేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పండన్న ప్రాణాలు కోల్పోయాడు.

ప్రశాంతంగా ఉన్న మన్యంలో

ఎన్‌కౌంటర్‌ కలకలం

ఇద్దరు మావోయిస్టుల మృతితో

ఉద్రిక్త వాతావరణం

అడవిని జల్లెడ పడుతున్న

పోలీసు బలగాలు

అగ్రనేతలే లక్ష్యంగా..

సాక్షి, పాడేరు: మావోయిస్టులు ఏజెన్సీలో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. దీనిలో భాగంగా కొయ్యూరు, వై.రామవరం, గూడెంకొత్తవీది మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి పోలీసు బలగాలు మోహరించాయి. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు టార్గెట్‌గా కూంబింగ్‌ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వై.రామవరం మండలం శేషరాయి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌ కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌, ఒడిశాకు చెందిన వాగా పాడియామి అలియాస్‌ నాగన్న అలియాస్‌ రమేష్‌ మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్ర నేతలు గాజర్ల రవి, అరుణక్క తదితర 15మంది వరకు కీలక నేతలు ఇదే అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్టు పోలీసుశాఖకు పక్కా సమాచారం అందడంతోనే గాలింపు చర్యలను బలగాలు విస్తృతం చేసినట్టు సమాచారం.

గత నెల 28న కొయ్యూరు మండలం కాకులమామిడి, వై.రామవరం మండలం సరిహద్దులోని కాంటవరం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు రెండు సార్లు పోలీసు కంట పడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే 15మంది వరకు మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ సామగ్రిని మాత్రం వదిలిపెట్టారు. మావోయిస్టులకు చెందిన ఎనిమిది రకాల సామగ్రిని పోలీసులు అదే రోజు స్వాధీనం చేసుకున్నారు. కిట్‌ బ్యాగుల ద్వారా మావోయిస్టుల సమాచారం సేకరించిన పోలీసు బలగాలు గాలింపు చర్యలను కొనసాగించి పట్టు సాధించాయి.

తుపాకుల మోత1
1/1

తుపాకుల మోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement