
పూర్తిగా పట్టు కోల్పోయిన మావోయిస్టులు
రంపచోడవరం: సరెండర్లు, అరెస్టుల నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. వై.రామవరం మండలం శేషరాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శేషరాయి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్తున్న పోలీసులను చూసిన 15 మంది మావోయిస్టులు కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసు బలగాలు కూడా కాల్పులు జరిపిన క్రమంలో మావోయిస్టులు కాకూరి పండన్న అలియాస్ జగన్, రమేష్ మృతి చెందారన్నారు. పండన్నపై 400 వరకు కేసులు ఉన్నాయన్నారు. అతనిపై రూ.20 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన రమేష్‌పై 30 క్రిమినల్ కేసులు నమోదు కాగా రూ.8 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. సంఘటన స్థలంలో రెండు ఏకే 47, 303 రైఫిల్, నాలుగు మ్యాగ్జన్స్, ఏకే 47 మ్యాగ్జన్స్ 3, కిట్ బ్యాగ్‌ల్లో విప్లవ సాహిత్యం, రూ.98వేల నగదు, మందులు, ఆలివ్ గ్రీన్ యూనిఫాం లభ్యమయ్యాయన్నారు. ఛత్తీస్‌గడ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత ఏవోబీ సుమారు 30 మావోయిస్టులు జిల్లాలోకి వచ్చినట్టు సమాచారం ఉందన్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై గట్టి నిఘా, కూంబింగ్ చేపట్టిందన్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలు అరుణ, ఉదయ్ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్నారు. ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్టుల సంఖ్య 13కు తగ్గిపోయిందన్నారు. ఆరు నెలలుగా గిరిజన గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై వారి నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. గిరిజన ప్రాంతం అభివృద్ధికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇప్పటికై నా మావోయిస్టులు, సానుభూతి పరులు లొంగిపోవాలని ఎస్పీ సూచించారు. ఎవరైఆన వారికి సహకరించినా, వారిని ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోందన్నారు. పోస్టుమార్టం అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. చత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. ఈ సమావేశంలో చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా, అడిషనల్ ఎస్పీ కె.ధీరజ్, రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ పాల్గొన్నారు.
పండన్నపై 400, రమేష్‌పై 30 కేసులు
ఇప్పటికై నా మిగతావారు, సానుభూతిపరులు లొంగిపోవాలి
ఎస్పీ అమిత్‌బర్దర్

పూర్తిగా పట్టు కోల్పోయిన మావోయిస్టులు